ITEACHERZ QUICK VIEW

17 July, 2015

బాల్యాన్ని బలిచేసే చట్ట సవరణ! :: వ్యతిరేకిద్దాం, ఇది ఉపాధ్యాయుల కర్తవ్యం.

ప్రభుత్వం బాలల హక్కులను హరించేందుకూ సమాయత్తమైంది.
బాలకార్మిక (నిషేధం, నియంత్రణ) చట్టం 1986కు కొన్ని సవరణలు చేయటానికి మే 13న కేబినెట్ సమావేశం తీర్మానించింది. ఆ మేరకు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిల్లుపెట్టే అవకాశం ఉంది. ప్రతిపాదిత సవరణలలో బాల్యాన్ని బలిచేసే అంశాలు రెండు ఉన్నాయి.
వాటిని పార్లమెంటు ఆమోదిస్తే...
ఒకటి, కార్పొరేట్ కంపెనీలు, ఫ్యాక్టరీలకు కార్మికులు చౌకగా లభించే 'స'దవకాశం ఏర్పడుతుంది.
రెండు, కుల వృత్తుల పేరుతో వర్ణ వ్యవస్థకు,
మనుధర్మ శాస్త్రానికి మళ్లీ జీవం పోసినట్లు అవుతుంది.
18 సంవత్సరాల వయస్సు వరకూ బాలలుగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల అంతర్జాతీయ సదస్సు ఆదేశించింది.
దానికి విరుద్ధంగా బాలలు అంటే 14 ఏళ్ల వరకే అంటూ ఈ సవరణ ద్వారా నిర్వచింపబడింది.
అందుకు విద్యాహక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుంటోంది.
14 ఏళ్ళ పైబడి 18 ఏళ్ళ ప్రాయం వరకు 'కౌమారపిల్లలు' (అడోల్సెంట్స్)గా నిర్వచిస్తూ మరో సవరణ చేర్చబడింది. బడికి పోవాల్సిన 14 ఏళ్ల లోపు బాలలు ఎలాంటి వృత్తుల్లోనూ పాల్గొనకుండా నిషేధిస్తున్నట్లు చెప్పింది.
కానీ, పాఠశాలేతర సమయాల్లో, సెలవుదినాల్లో కుటుంబానికి సహాయంగా పొలం పనులు, ఇంటిపనులు, అటవీ ఉత్పత్తుల సేకరణ, సాంకేతిక సంస్థల్లో పాల్గొనవచ్చునని వివరించింది.
టీవీ సీరియల్స్, వినోదాత్మక కార్యక్రమాల్లో, వ్యాపార ప్రకటనల్లో కూడా పాల్గొనవచ్చని చెప్పింది.
ఇక 14-18 సంవత్సరాల కౌమారులు గనులు, ప్రేలుళ్లు వంటి ప్రమాదకరమైన పనులు తప్ప మిగిలిన వాటిలో పాల్గొనవచ్చని అనుమతించింది.
చదువుకుంటూ కుటుంబానికి చేయూతనివ్వటానికే ఈ సవరణ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.
పేద కుటుంబాల పిల్లలు ఇంటి పనులు, వంట పనులు, పొలం పనులు, హోటళ్లలో, మెకానిక్ షెడ్లలో పనులు చేస్తూ ఉండటం వల్లనే చదువుకోలేకపోతున్నారనే సమస్యకు ఇదా పరిష్కారం?
కుటుంబ సంబంధిత పనుల్లో పాల్గొనవచ్చని ప్రభుత్వం చెప్పాలా?
అందుకు ప్రత్యేకంగా చట్టం తేవాలా?
పాఠశాలేతర సమయాల్లో పనులు చేసుకుని బతకాలని ప్రభుత్వమే చెబితే బాలల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ఆటలు, పాటలు, వినోద కార్యక్రమాలు, సాంఘిక సమాజంలో పాల్గొనాల్సిన అవసరం లేదా? నెలకూ రూ.5 వేల ఆదాయం కూడా లేని కుటుంబాలు 74 శాతం ఉన్నట్లు,
రోజుకు రూ.33లు కూడా ఖర్చుపెట్టుకోలేని దారిద్య్రంలో మగ్గిపోతున్న వారు కోట్లాదిమంది ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలియందేమీ కాదే.
అలాంటి కుటుంబాల పిల్లలు బడివేళలో కూడా పనికి పోతేనే కదా పొట్టగడిచేది.
బడి ఈడు పిల్లల పనితో నిమిత్తం లేకుండా పేద కుటుంబాల బ్రతుకుతెరువుకు భరోసా కల్పించగలిగితే విద్యాహక్కును వినియోగించుకునే మార్గం సుగమం కాగలదు.
అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.
దానిని విస్మరించి ఉచిత సలహాలతో ఎన్ని చట్టాలు తెచ్చినా ఏమి లాభం?
బాల కార్మిక చట్టానికి ఇలాంటి సవరణలు ఎందుకు చేస్తున్నట్లు?
ప్రభుత్వం చేసే చట్టాలు, చేస్తున్న చర్యలు పెట్టుబడిదారులు, కార్పొరేట్ల మేలు కోసమేననేది అందరికీ తెలిసిందే.
కార్మిక చట్టాల సవరణలు అయినా, పారిశ్రామిక వివాదాల చట్టాలకు సవరణలు అయినా, బాల కార్మిక చట్టానికి సవరణలు అయినా అందుకోసమే.
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులూ దేశదేశాలు తిరిగి పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు సకల సౌకర్యాలూ సమకూరుస్తామని చెబుతున్న వాటిలో సబ్సిడితో భూమి, నీరు, విద్యుత్తు, రవాణా మార్గాలతో పాటు చౌకగా శ్రామికులనూ సరఫరా చేస్తామనేది ఉంది.
కర్మాగారాలు, పరిశ్రమలు, కంపెనీల్లో పెద్దవారితో పాటు పిల్లలు కూడా కొన్ని అనుబంధ పనుల్లో పాల్గొనే అవకాశాలు కల్పించబడతాయి.
తద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పోగేసుకునేందుకు కార్పొరేట్లకు బాలల శ్రమను వెచ్చించటమే కాగలదు. ప్రధాని చెబుతున్న 'మేక్ ఇన్ ఇండియా'లో ఇవన్నీ దాగివున్న రహస్యాలు.
స్వామి కార్యంతో పాటు స్వకార్యమూ నెరవేర్చుకునే కుతంత్రం బాలకార్మిక చట్ట సవరణలో దాగి ఉన్నది. చాలా కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులతో పాటు వృత్తిపనుల్లో పాల్గొంటూ ఉంటారు.
అందుకు పిల్లల్ని అలవాటు చేయాలనే లక్ష్యం కోసమే సవరణ చేస్తున్నట్లు చెప్పబడింది.
చెప్పుల తయారీ,
వడ్రంగం,
కుండల తయారీ,
బుట్టలు అల్లటం,
చేపలు పట్టటం,
బట్టలు ఉతకటం,
పశువులు కాయడం,
కలుపు తీయటం,
పంటచేలల్లో పనిచేయటం వంటివి కులవృత్తులేగా!
సంపన్నుల బిడ్డలు ఇలాంటి పనులు చేస్తారా?
కనుక కులవృత్తులను ప్రోత్సహించి బిజెపి మూల సిద్ధాంతమైన వర్ణవ్యవస్థ,
మనుధర్మశాస్త్రాన్ని బలపర్చుకోవటానికే దారితీస్తుంది.
కేంద్రం తలపెట్టిన సవరణలను పార్లమెంటు ఆమోదిస్తే దేశవ్యాప్తంగా బాలకార్మికత ఇంకా పెరుగుతుంది. దళిత, గిరిజన, తదితర పేదల పిల్లలు చదువుకు మరింత దూరమవుతారు.
డ్రాపవుట్స్ ప్రబలుతాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోతుంది.
విద్యాహక్కు చట్టం 'ఏనుగు మింగిన వెలగపండులా' మిగిలిపోతుంది.
బాలల హక్కుల కోసం ఇంతకాలం చేసిన ఉద్యమాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా వృథా అవుతాయి. కనుక బాలల భవితను దెబ్బతీసే ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలి.
పిల్లలు చదువుకుంటూ పనులు చేసుకోవచ్చనే సవరణలను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు, మెయిల్స్, ట్వీట్స్ పంపాలి.
బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయాలని పార్లమెంటు సభ్యులకు విజ్ఞప్తులు చేయాలి.
బాల్యాన్ని బలిచేసే బిజెపి ప్రభుత్వ దుర్మార్గాన్ని అన్ని విధాలా అడ్డుకోవాలి.
- నాగటి నారాయణ
(వ్యాసకర్త విద్యా వికాస వేదిక కన్వీనర్)

No comments:

Post a Comment

Popular Posts