హైదరాబాద్,
అక్టోబర్ 7: నిరుద్యోగులూ.. పారాహుషార్! కొలువుల జాతరకు సిద్ధం కండి.
గ్రూప్-1, గ్రూప్-2, లెక్చరర్లతోపాటు రకరకాల ఉద్యోగాలు. వేలాదిగా మీ కోసం
కొలువు దీరనున్నాయి. పోటీలో విజయం సాధించి ప్రభుత్వ కొలువు చేపట్టేందుకు
రెడీగా ఉండండి. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మానస పుత్రిక
‘లక్ష ఉద్యోగాల కల్పన’కు రంగం సిద్ధమవుతోంది.
ఈ
ఏడాది డిసెంబర్ 31వ తేదీనాటికి లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని,
ప్రధాని చేతులు మీదుగా నియామక పత్రాలు అందజేస్తామని కూడా సీఎం కిరణ్
ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. త్వరలోనే వరుస
నోటిఫికేషన్లు రానున్నాయి.
ఒకదాని తర్వాత మరొకటిగా
నోటిఫికేషన్లను విడుదల చేయడమే కాదు.. గతానికి భిన్నంగా.. ఏమాత్రం ఆలస్యం
చేయకుండా వాటికి పరీక్షలనూ నిర్వహించాలని సర్కారు కసరత్తు చేస్తోంది.
ఎంపికైన వారికి వెంటనే నియామక ఉత్తర్వులనూ ఇవ్వాలని భావిస్తోంది. ఈ
మేరకు తొలి దశలో 33 వేల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో వెలువడనున్నాయి.
ఏయే పోస్టులను తొలి దశ నోటిఫికేషన్‌లో చేర్చాలన్న దానిపై ఆర్థిక శాఖ
చర్చలు జరుపుతోంది.
వివిధ శాఖల నుంచి ఖాళీల సంఖ్యను తెప్పించుకుని, వాటిలో వెంటనే భర్తీ
చేయాల్సిన పోస్టుల వివరాలు తెలపాలని కోరింది. ప్రాధాన్యక్రమంలో పోస్టుల
వివరాలు రాగానే 33 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు
ఆర్థిక శాఖ అనుమతి ఇస్తుంది. ఈ ప్రక్రియ అంతా వీలైనంత తొందరగా పూర్తి
చేయాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. దీంతో, ఆ శాఖ ముఖ్య
కార్యదర్శి భాస్కర్ ఖాళీల భర్తీపై వివిధ శాఖల అధిపతులతో చర్చిస్తున్నారు.
courtesy: http://sevalive.com/