ITEACHERZ QUICK VIEW

29 February, 2012

లీపు సంవత్సరం ( Leap Year ) విశేషాలు :: ఆంధ్రప్రభ దినపత్రిక

ప్రతి నాలుగవ సంవత్సరం, లేదా 4తో నిశ్శేషంగా భాగించబడే ప్రతి సంవత్సరం లీపు సంవత్సరం అనే అభిప్రాయం చాలామందిలో వుంది. కాని అది నిజం కాదు. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న క్యాలెండర్‌ సౌరమానం ప్రకారం నిర్ణయించబడింది. అంటే సూర్యుని చుట్టూ భూమి ఒక చుట్టు చుట్టి రావడానికి సంబంధించిన సమయాన్ని బట్టి నిర్థారించబడింది. సూర్యుని చుట్టూ భూమి ఒక చుట్టు చుట్టి రావడానికి ఇంచుమించు 365 1/4 రోజులు పడుతుంది. అంటే 365 రోజుల 5 గంటల 48 నిముషాల 45,9747 సెకన్లు, మొదట్లో భూ పరిభ్రమణ కాలాన్ని లెక్కలోకి తీసుకొని సంవత్సరానికి 365రోజులుగా నిర్థారించారు. నాలుగు సంవత్సరాలలో మిగిలిపోయే నాలుగు పావు రోజులనూ కలిపి, ప్రతి నాలుగవ ఏడాదికి ఒక రోజును అదనంగా కలిపి, ఆ ఏడాదిలో 366 రోజులుగా తీర్మానించారు.
అయితే దీని వల్ల సమస్య పూర్తిగా పరిష్కరించబడలేదు. ఎందుకంటే ఈ పద్ధతిలో క్యాలెండర్‌ని నిర్ణయించినప్పుడు కూడా ప్రతి ఏడాది 0.0078 రోజులు తేడావచ్చి, ప్రతి 400 సంవత్సరాలకు అది సుమారుగా 3 రోజులు (3.12) కావడం మొదలుపెట్టింది. అంటే క్యాలెండర్‌ ప్రకారం ప్రతి 400 ఏళ్లకు 3 రోజులు అదనంగా కలుస్తూ వస్తున్నాయన్నమాట.
దానితో క్యాలెండర్‌ని మరింతగా సవరించాల్సి వచ్చి 1582లో పోప్‌ గ్రిగరీ క్లేవియస్‌ అనే ఖగోళ శాస్త్రవేత్త ప్రతి 400 ఏళ్లకు 3 లీపు సంవత్సరాలను తొలగించడమే దీనికి పరిష్కారమని సూచించాడు. అంటే ప్రతి 400 ఏళ్లలోనూ మొత్తం 100 లీపు సంవత్సరాలు కాక కేవలం 97 లీపు సంవత్సరాలే వుండాలి. దీనిని దృష్టిలో పెట్టుకుని 1600, 1700, 1800, 1900... వంటి శతాబ్ది సంవత్సరాలలో 4తో గాక, 400తో నిశ్శేషంగా భాగింపబడే సంవత్సరాన్నే లీపు సంవత్సరంగా పరిగణించాలని తీర్మానించారు. అందుకే లీపు సంవత్సరాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.

No comments:

Post a Comment

Popular Posts