ఓం సముఖాయ నమః
మాచీపత్రం పూజయామి
మాచీ పత్రం : తెలుగులో దీనిని మాచ పత్రి అంటారు. చామంతి జాతికి చెందిన ఈ ఆకులు సువాసన వెదజల్లుతాయి. ఇవి దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కంటి సంబంధ, చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి.
ఓం గణాధిపాయనమః
బృహతీ పత్రం పూజయామి
బృహతీ పత్రం : దీనిని ములక, వాకుడాకు అంటారు. ఇవి వంగ ఆకుల మాదిరి, తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర, నేత్ర వ్యాధులను నయం చేస్తుంది. దంత ధావనానికి కూడా ఉపయోగిస్తారు.
ఓం ఉమాపుత్రాయ నమ:
బిల్వ పత్రం పూజయామి
బిల్వ పత్రం : బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా కూడా లభ్యమవుతాయి. ఇవి శివుడికి ఇష్టమైనవి. మహాలక్ష్మికి కూడా
ఇష్టమైనవని చెబుతారు. ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధాన్ని తగ్గిస్తుంది.
ఓం గజాననాయ నమ :
దూర్వాయుగ్మం పూజయామి
దూర్వా యుగ్మం : దూర్వా యుగ్మం అంటే గరిక. ఇందులో తెల్ల గరిక, నల్ల గరిక అనే రకాలున్నాయి. ఇది వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు, ఉదర సంబంధ వ్యాధులు, అర్శ మొలలను నివారిస్తుంది.
ఓం హరసూనవే నమః
దత్తూర పత్రం పూజయామి
దత్తూర పత్రం : దత్తూర అంటే ఉమ్మెత్త మొక్క. ఇది సెగ గడ్డలు, స్తనవాపు, చర్మ, శ్వాసకోశ వ్యాధులు, పేను కొరుకుడు, నొప్పులు, రుతు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషం కాబట్టి
జాగ్రత్తగా వాడుకోవాలి.
ఓం లంబోదరాయ నమః
బదరీ పత్రం పూజయామి
బదరీ పత్రం : బదరీ పత్రం అంటే రేగు ఆకు. ఇందులో రేగు, జిట్రేగు, గంగరేగు అనే మూడు రకాలున్నాయి. జీర్ణకోశ, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లలకు వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
ఓం గుహాగ్రజాయనమః
అపామార్గ పత్రం పూజయామి
అపామార్గ పత్రం : తెలుగులో ఉత్తరేణి అంటారు. గింజలు సన్నటి ముళ్లను కలిగి ఉంటాయి. ఇది దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవిపోటు, రక్తం కారటం అర్శమొలలు, ఆణెలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాలలో రాళ్లను నివారించడానికి ఉపయోగపడుతుంది.
ఓం గజకర్ణాయనమః
తులసీ పత్రం పూజయామి
తులసీ పత్రం : హిందువులు దేవతార్చనలో వీటిని విధిగా వాడతారు. ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం,
గాయాలను తగ్గిస్తుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
చూత పత్రం : అంటే మామిడి ఆకు. ఈ
ఆకులకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. వీటిని వాడని హైందవ గృహాలు ఎక్కడా ఉండవు. ఇది రక్త
విరేచనాలు, చర్మ వ్యాధులు, ఇంట్లోని క్రిమికీటకాల నివారణకు ఉపయోగపడుతుంది.
ఓం వికటాయ నమః
కరవీర పత్రం పూజయామి
కరవీర పత్రం : దీనినే గన్నేరు అంటారు. దీని
పువ్వులు తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఈ పువ్వులకు పూజల్లో విశిష్ట స్థానం ఉంది. ఇది కణుతులు, తేలు కాట్లు, విషకీటకాల కాట్లు, దురద, కంటి సంబంధ, చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.
ఓం భిన్నదంతాయ నమః
విష్ణుక్రాంత పత్రం పూజయామి
విష్ణుక్రాంత పత్రం : ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలం రంగు పువ్వులుండే మొక్కను విష్ణుక్రాంత అని పిలుస్తారు. ఇది జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధులను తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
ఓం వటవే నమః
దాడిమీ పత్రం పూజయామి
దాడిమీ పత్రం : దాడిమీ అంటే దానిమ్మ మొక్క. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీ ఫల నైవేద్యం ఎంతో ఇష్టం. అతిసారం , విరేచనాలు, దగ్గు, కామెర్లు, అర్శమొలలు,
ముక్కు నుంచి రక్తం కారటం, కండ్లకలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది.
ఓం సర్వేశ్వరాయ నమ:
దేవదారు పత్రం పూజయామి
దేవదారు పత్రం : దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. దీని మానుతో చెక్కే
విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మవ్యాధులు, కంటి వ్యాధులను తగ్గిస్తుంది.
ఓం పాలచంద్రాయ నమః
మరువక పత్రం పూజయామి
మరువక పత్రం : ధవనం, మరువం అంటారు.
ఆకులు ఎండినా సువాసన వెదజల్లటం దీని ప్రత్యేకత. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జట్టు రాలటం, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.
ఓం హేరంభాయ నమః
సింధువార పత్రం పూజయామి
సింధువార పత్రం : వీటినే వావిలి అంటారు. ఇవి జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, గాయాలు, చెవిపోటు, చర్మవ్యాధులు, మూర్చ వ్యాధి, ప్రసవం అనంతరం వచ్చే
ఇబ్బందులను తగ్గిస్తాయి.
ఓం శూర్పకర్ణాయ నమః
జాజీ పత్రం పూజయామి
జాజి పత్రం : ఇది సన్న జాజిగా పిలవబడే మల్లి జాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయ వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది.
ఓం సురాగ్రజాయ నమః
గండకీ పత్రం పూజయామి
గండకీ పత్రం : దీనిని లతా దూర్వా, దేవకాంచనం అంటారు. మూర్ఛ, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు, నులి పురుగులను నివారిస్తుంది. దీని ఆకులను ఆహారంగా కూడా వినియోగిస్తారు.
ఓం వినాయకాయ నమః
అశ్వత్థ పత్రం పూజయామి
అశ్వత్థ పత్రం : రావి ఆకులను అశ్వత్థ పత్రాలంటారు. ఇవి మల బద్ధకం, కామెర్లు, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు, నోటిపూత, చర్మవ్యాధులను నివారిస్తాయి. జీర్ణశక్తిని, జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి.
ఓం సురసేవితాయ నమః
అర్జున పత్రం పూజయామి
అర్జున పత్రం : తెల్ల మద్దిచెట్టు ఆకులనుఅర్జున పత్రాలంటారు. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి. ఇది అడవులలో పెరిగే పెద్ద వృక్షం. చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు బాగా పనిచేస్తుంది.