ITEACHERZ QUICK VIEW

22 January, 2015

మండలానికి మూడే స్కూళ్లు! క్లస్టర్ స్కూళ్ల పేరుతో ప్రాథమిక విద్యకు తూట్లు :: Saakshi 22.1.15

* మండలానికి మూడే స్కూళ్లు!
* గ్రామానికి ఒక పాఠశాల విధానానికి మంగళం
* క్లస్టర్ స్కూళ్ల పేరుతో ప్రాథమిక విద్యకు తూట్లు
* పైలట్ ప్రాజెక్టుగా వైఎస్సార్, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో అమలు
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా..
* తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు

 
ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాలనే విధానానికి స్వస్తిపలికి ప్రతి మండలంలో 3 స్కూళ్లు మాత్రమే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామాల్లో పాఠశాలలను మూసివేసి వాటి స్థానంలో ఒకేచోట క్లస్టర్ స్కూలు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని పది కిలోమీటర్ల పరిధిలోని స్కూళ్లన్నింటినీ కలిపి ఒకేచోట పెట్టాలని నిర్ణయించింది. మండలంలో మిగిలిన గ్రామాలకు మధ్యలో ఉండి, విద్యా ప్రమాణాలు బాగున్న స్కూలును ఎంపిక చేసి అన్ని స్కూళ్లను దాన్లో విలీనం చేస్తారు. తొలిదశలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న స్కూళ్లను.. ఎంపిక చేసిన స్కూలులో విలీనం చేసి దాన్ని క్లస్టర్ స్కూలుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.
క్లస్టర్ స్కూలులో ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠాలు చెబుతూ కనీసం వెయ్యిమంది పిల్లలుండేలా చూడాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీచేశారు. దీన్ని మొదట వైఎస్సార్, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసి, వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ద్వారకా తిరుమల మండలంలో రంగం సిద్ధం
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి, పంగిడిగూడెం, ద్వారకాతిరుమలలో మూడు క్లస్టర్ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మండలంలో 66 ప్రభుత్వ స్కూళ్లున్నాయి. పిల్లల సంఖ్య, దూరాన్ని బట్టి 13 క్లస్టర్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని మండల విద్యాశాఖాధికారి ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం మూడు క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఇదే తరహాలో క్లస్టర్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
రాష్ట్రంలో 45,663 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 42,77,193 మంది చదువుతున్నారు. మండలానికి మూడు లెక్కన 667 మండలాలకు 2,001 స్కూళ్లను మాత్రమే ఉంచి వాటిని కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే మిగిలిన 43,662 స్కూళ్లను మూసివేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అన్ని స్కూళ్లను ఒకేసారి కాకుండా దశల వారీగా ఎత్తేయాలని చూస్తున్నారు. మరీ తీవ్ర వ్యతిరేకత వస్తే ప్రతి మండలంలో ఇంకో రెండు, మూడు క్లస్టర్ స్కూళ్లు ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ఆందోళన
క్లస్టర్ స్కూళ్ల విధానాన్ని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాల అందుబాటులోకి రావడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఇప్పుడు వాటిని మూసేసి మండలానికి మూడు మాత్రమే పెద్ద స్కూళ్లు పెడితే మారుమూల గ్రామాల పిల్లలు అక్కడికి వెళ్లి చదువుకోవడం ఎలా సాధ్యమో అంతుబట్టని ప్రశ్నగా మారింది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

No comments:

Post a Comment

Popular Posts