ITEACHERZ QUICK VIEW

22 January, 2015

బ్లాగ్మిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు

'అంబ పలుకు జగదాంబ పలుకు' అంటూ కీర్తించే
బుడబుక్కల వాళ్ళ డమరుక ద్వని ...
'హరిలో రంగ హరీ ' అంటూ దీవించే
హరిదాసుల విష్ణునామ సంకీర్తనలు ...
జంగ దేవరుల ఇత్తడి ఘంటా ద్వనులు ...
పితృల ఋణం తీర్చే పితృతర్పణాలు ...
బోగిమంటలు, కోడి పందాలు ...
పిట్టల దొరలు, చెంచు నాయకులు ...
గంగెరెద్దుల విన్యాసాలు, గాలిపటాలు ...
వాకిట ముంగిట్లో విరబూసిన రంగవల్లులు...
గౌరీదేవి ప్రతిరూపాలయిన గొబ్బేమ్మలు ...
బొమ్మల కొలువులతో విరిసే చిన్నారుల బోసినవ్వులు ...
ఇంటింటా సంక్రాంతి ...వాడవాడకు క్రాంతి
ఊరంతా సంక్రాంతి సంబరాలు, సరదాలు...
మన సంస్కృతిని భావితరాలవారికి అందించే
ముచ్చటగా మూడురోజుల పండుగ
జరుపుకోకపోతే జీవితమే దండగ !
రచన: కాయల నాగేంద్ర
Visit NAGENDRA's blog

సంక్రాంతి అభ్యుధయ కాముకులను కూడా సంప్రదాయం వైపు మళ్ళిస్తుంది. పండుగలు, పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సంప్రదాయం వైపు మొగ్గుచూపుతారు. అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది. సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని  ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో  అలంకరించడం నెలరోజులపాటు సాగుతుంది. చివరి రోజున రధం ముగ్గును వేస్తారు. జానపదుల కళలు ఈ సంక్రాంతి  పండుగ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా
బహిర్గతమవడమే కాకుండా ప్రదర్శింపబడతాయి. వీటిలో చెప్పుకోతగ్గది "గంగిరెద్దుల" ఆట. కొన్ని గ్రామాలలో ఐతే
'కోడి పందాల ఆట' కూడా ఆడుతారు.

ఇంకా సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది.  నక్షత్రాల ఇరువది ఏడు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి  నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా  విభాగించారు. సూర్యుడు  నెలకొకరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా  వ్యవహరింపబడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని 'మకర సంక్రాంతి ' అని అంటారు. హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల
వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో "సంక్రాంతి" ప్రముఖస్ధానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు "మకరరాశిలో" ప్రవేశించిన పుణ్యదినం. ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి  "క్రాంతి"  అంటే అభ్యుదయం.
మంచి అభ్యుదయాన్ని  ఇచ్చు క్రాంతి  కనుక  దీనిని  "సంక్రాంతి"  గా  పెద్దలు వివరణ  చెబుతూ "మకరం"  అంటే! మొసలి.  ఇది పట్టుకుంటే  వదలదు అని  మనకు తెలుసు.  కాని  మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి  అడుగడుగునా  అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో  ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ "మకర   సంక్రమణం" పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి  వారు యధాశక్తి 'లేదు' అనకుండా  దానధర్మాలు చేయుటయే మంచిదని, శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు. అలా! కేవలం అప్పుడే కాకుండా! నిత్య జీవనంలో కూడా దాని బారిని పడకుండా చూచుకుంటూ ఉండాలికదా! మరి. ఇక ఈ పండుగల లోని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు, వరుసగా మూడు రోజులు వచ్చే పండుగలు ఇవే! ముఖ్యంగా
' సంక్రాంతి' అని పిలుచుకుంటాం. దీనిని పెద్ద పండుగ అని
కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ
పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి.
పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో,
ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ
పండుగ వస్తుందంటే పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు
, చక్రాలలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ
లాడుతూ ఉంటాయి.
మొదటి రోజు 'భోగి'. మూల మూలల చెత్తా, పనికిరాని కర్ర
దుంగలూ ఓచోట చేర్చి, భోగి మంటలు వేసి, ఎముకలు కొరికే
చలిని తరిమి కొడతారు. ఇళ్ళలో బొమ్మల కొలువులు,
చిన్న పిల్లలకి భోగి పళ్ళు దిష్టి తీయడం వంటి
ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. పంట చేతికొచ్చిన ఆనందలో
ఇళ్ళకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు.
రెండో రోజు 'సంక్రాంతి '. సూర్యుడు మకరరాశిలో
ప్రవేశించే శుభదినం. ఈ పండుగకు కొత్తశోభ
తీసుకురావడానికి, వారం, పది రోజుల ముందే
ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ.
చనిపోయిన పెద్దలను తలచుకుని మొక్కుతారు.
పిండివంటలు చేస్తారు. నలుగురికీ పంచిపెట్టి, తాము తిని
సంబరంగా గడుపుతారు.
మూడో రోజు ' కనుమ'. దీన్నే పశువుల పండుగ అని
అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ,
పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల
కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు.
పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే
రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని
ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు.
గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల
రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు,
కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తాయి.
ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే
గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా
ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో,
కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని
ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన
నాటినుండి వివిధ ఆలయాలలోని
అర్చకస్వాములు "సంక్రాంతి" నెలపట్టి సూర్యోదయానికి
పూర్వమే మంగళవాయిద్యాలతో
నదీజలాలను "తీర్ధంబిందులలో" తోడ్కొని వచ్చి
విశేషార్చనలు నిర్వహిస్తారు.
ఇంటిముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ!
ప్రతిరొజు వివిధ రకాల ముగ్గులతో! సప్తవర్ణాల
రంగవల్లికలను తీర్చిదిద్ది "ఇంద్రధనుస్సులను"
ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు.
ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే "సంక్రాంతి"
పండుగలు మనం జరుపుకుని మహారాణిలావచ్చే ఆ
సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి
ఆహ్వానం పలుకుదాం.

No comments:

Post a Comment

Popular Posts