భూమి వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయు నిల్వల స్ధాయి రికార్డు స్ధాయికి చేరిందని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్ధ (వరల్డ్ మీటియరలాజికల్ ఆర్గనైజేషన్ -డబ్ల్యూ.ఎం.ఒ) తెలిపింది. గతంలో ఎన్నడూ ఇంత సాంద్రతతో గ్రీన్ హౌస్ వాయు నిల్వలు భూ వాతావరణంలో లేవని, 2012, 2013 సంవత్సరాల్లోనే అత్యధిక స్ధాయిలో ఈ నిల్వలు పెరిగాయని సంస్ధ చెప్పడం విశేషం.
గత రెండు, మూడేళ్లుగా ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాల (గ్రీన్ హౌస్ వాయువులు) విడుదలను తగ్గించడం ఎలా అన్న విషయాన్ని చర్చిస్తున్నాయి. వారు ఒక పక్క చర్చిస్తూనే మరో పక్క కర్బన వాయు నిల్వలను పెంచే విధానాలను యధా శక్తి అమలు చేస్తున్నారని డబ్ల్యూ.ఎం.ఒ వెల్లడించిన వివరాలు తెలియజేస్తున్నాయి.
డబ్ల్యూ.ఎం.ఒ చెబుతున్న వివరాలు ప్రస్తుత కర్బన ఉద్గారాల (carbon emissions) గురించి కాదు. 2013 నాటి వరకు విడుదల చేసిన కర్బన వాయువులు వాతావరణంలో ఏ స్ధాయిలో పేరుకునిపోయిందో తెలియజేసే వివరాల గురించి.
మానవ జీవనం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలను తనలో ఇముడ్చుకునే శక్తి భూమిపై ఉన్న ప్రకృతికి సహజంగా ఉంటుంది. ఈ శక్తిని దాటిపోవడంతో సదరు వాయువులు వాతావరణంలో ప్రమాదకర స్ధాయిలో పేరుకుపోతున్నాయి. ఈ స్ధాయి గురించే డబ్ల్యూ.ఎం.ఒ చెబుతున్నది. ఇప్పుడు వాస్తవంగా ఏ స్ధాయిలో వివిధ దేశాలు కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయో... అన్నది వేరే లెక్క. దాని గురించి మాట్లాడితే మరింత ఆందోళన తప్పదు.
తన వార్షిక బులిటెన్ లో డబ్ల్యూ.ఎం.ఒ తాజా వివరాలను వెల్లడించింది. బులెటిన్ ప్రకారం 1990-2013 మధ్య కాలంలో వాతావరణంపై వేడి ప్రభావం (radiative forcing) 34 శాతం పెరిగింది. వాతావరణంలో ఎక్కువ కాలం పాటు నిలవ ఉండే గ్రీన్ హౌస్ వాయువులయిన కార్బన్ డయాక్సైడ్, మిధేన్, నైట్రస్ ఆక్సైడ్ లవల్లే ఈ పెరుగుదల సంభవించింది.
పారిశ్రామిక యుగం పూర్వం (1750) నాటి స్ధాయితో పోలిస్తే 2013లో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత 142 శాతం పెరిగింది. మిధేన్ సాంద్రత 253 శాతం పెరగ్గా, నైట్రస్ ఆక్సైడ్ సాంద్రత 121 శాతం పెరిగిందని డబ్ల్యూ.ఎం.ఒ పరిశోధకులు చెప్పారు. ముందే చెప్పినట్లు ఇవి కర్బన ఉద్గారాలు (carbon emissions) కాదు. 2013 వరకు వెలువడిన ఉద్గారాల వలన వాయావరణంలో పెరుకుపోయిన నిల్వలు.
1984 తర్వాత కాలంలో 2012, 2013 సంవత్సరాల లోనే CO2 నిల్వలు రికార్డు స్ధాయికి పెరిగాయని గ్లోబల్ అట్మాస్ఫియర్ వాచ్ సంస్ధ పరిశోధనల్లో తేలిందని పి.టి.ఐ తెలిపింది.
ప్రాధమిక వివరాల ద్వారా వచ్చిన అంచనాల ప్రకారం ఈ రికార్డు స్ధాయి నిల్వలకు కారణం CO2వాయువును ఇక ఎంతమాత్రం ఇముడ్చుకోలేని స్ధితికి బయోస్ఫియర్ చేరుకోవడం వల్లనే. దానితో పాటు CO2 వాయువు విడుదల బాగా పెరిగిపోతూ ఉండడం వల్ల కూడా నిల్వల స్ధాయి పెరుగుతోంది.
బులెటిన్ చెబుతున్న సాంద్రతలు, ప్రకృతిలో వివిధ రకాల చర్య, ప్రతిచర్యలతో పాటు, మానవుని ఉత్పత్తి కార్యకలాపాలన్నీ అయ్యాక వాతావరణంలో పేరుకుపోయిన గ్రీన్ హౌస్ వాయువుల నిల్వల స్ధాయిని తెలుపుతాయి.
గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలలో (emissions) పావు భాగాన్ని సముద్రాలు తమలో ఇముడ్చుకుంటాయి. మరో పావు భాగాన్ని బయోస్ఫియర్ (భూవాతావరణ వ్యవస్ధ) ఇముడ్చుకుంటుంది. ఆ విధంగా వాతావరణంలో మిగిలిపోయే CO2 నిల్వలను ప్రకృతి తగ్గిస్తుంది.
|
Pages
▼
No comments:
Post a Comment