Pages

29 August, 2011

గాంధేయం జయించింది :: దీక్ష విరమించిన అన్నాహజారే

న్యూఢిల్లీ: జన్ లోక్‌పాల్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ పన్నెండు రోజులుగా ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిరాహార దీక్ష చేస్తున్న సంఘ సంస్కర్త అన్నాహజారే ఆదివారం ఉదయం తన దీక్షను విరమించారు. అన్నా దీక్షను ఐదేళ్ల చిన్నారులు సిమ్రాన్, ఇక్రా కొబ్బరి నీళ్లు ఇచ్చి విరమింపజేశారు. సిమ్రాన్ పారిశ్రామిక వాడకు చెందిన చిన్నారి. ఇక్రా తుర్కమన్ ఘాట్‌ నివాసి. అన్నా దీక్ష విరమణ సమయానికి రాంలీలా మైదానానికి వేలాది అన్నా మద్దతుదారులు వచ్చారు. మైదానం వందేమాతరం నినాదాలతో మారుమ్రోగింది. అన్నా మద్దతుదారులతో రాంలీలా మైదానం కిక్కిరిసింది. ఈ నెల 16వ తారీఖున దీక్ష చేపట్టిన అన్నాహజారే పన్నెండు రోజుల తర్వాత ఆదివారం దీక్షను విరమించారు. అన్నా విజయోత్సవానికి మద్దతుగా దేశవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.

దీక్ష విరమణ అనంతరం అన్నా మాట్లాడారు. జన్ లోక్‌పాల్ బిల్లు విజయం దేశ ప్రజల విజయం అన్నారు. విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అంతకు ముందు - అన్నాకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు కేజ్రీవాల్ చెప్పారు. పార్లమెంటులో అన్నాకు మద్దతు ఇచ్చిన పార్టీలకు, నేతలకు, అలాగే అన్నా షరతులు అంగీకరించిన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సైతం ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశ విదేశాల నుండి సైతం అన్నాకు మద్దతు లభించిందన్నారు.

ఎన్నికల సంస్కరణలు అవసరమని అన్నా హజారే అన్నారు. రైతు సమస్యలు కూడా ఉననాయని ఆయన అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన యువతకు ధన్యవాదాలు తెలిపారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల సమస్యలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఇండియా గేట్ వద్ద విజయోత్సవ సంబరాలు జరుగుతాయి. రామ్‌లీలా మైదానంలో పండుగ వాతావరణం నెలకొని ఉంది.

No comments:

Post a Comment